నాలుగు నెలల్లోనే పూర్తి కాబోతున్న సూపర్‌ స్టార్‌ మూవీ.. ఇంత స్పీడ్‌ ఎందుకంటే!  

నాలుగు నెలల్లోనే పూర్తి కాబోతున్న సూపర్‌ స్టార్‌ మూవీ.. ఇంత స్పీడ్‌ ఎందుకంటే!  

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో ‘దర్బార్‌’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రం ప్రారంభం అయ్యింది. పోలీస్‌గా రజినీకాంత్‌ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు.

భారీ అంచనాలున్న ఈ చిత్రంను కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేసేందుకు ప్లాన్‌ చేయాల్సిందిగా దర్శకుడు మురుగదాస్‌కు రజినీకాంత్‌ సూచించినట్లుగా సమాచారం అందుతోంది. తమిళ సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను ఇదే ఏడాది దీపావళికి లేదా ఈ ఏడాది చివర్లో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారట.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. ఆమె డేట్లు కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.

ఆమెకు ఉన్న ఇతర కమిట్‌మెంట్స్‌ను కూడా వాయిదా వేయించి, ఎక్కువ పారితోషికం ఇచ్చి మరీ రజినీకాంత్‌ మూవీకి ఆమెను తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. కేవలం నాలుగు నెలల్లో సినిమాకు సంబంధించిన షూటింగ్‌ అంతా పూర్తి చేయాలని భావిస్తున్నారు.

త్వరలోనే తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే సినిమా మద్యలో వదిలేయాల్సి వస్తుందేమో అనే ఉద్దేశ్యంతో హడావుడిగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే తమిళనాడు అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తాను పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా రజినీకాంత్‌ ప్రకటించాడు.

తప్పకుండా రాజకీయాల్లో తాను క్రియాశీలకంగా వ్యవహరిస్తాను అంటూ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో రజినీకాంత్‌ ‘దర్బార్‌’ చిత్రంను పూర్తి చేసేందుకు ఎక్కువ హడావుడి చూపుతున్నట్లుగా తెలుస్తోంది.